సరఫరా చేయని మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా పరిగణిస్తాం

04-11-2026 | 09:14pm
  1. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
  2. పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల, నవంబర్ 04 ( విజయ క్రాంతి ): రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్డ్ రైస్(Custom-milled rice) (సీఎంఆర్) బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారితో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ పెండింగ్ సీఎంఆర్ బియ్యం డెలివరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా పెండింగ్‌లో ఉన్న అక్‌ల వివరాలు, బియ్యం సరఫరా పురోగతి, గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ

రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇంకా 2,564 ఏసికే ల సీఎంఆర్ డెలివరీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. పెండింగ్ బియ్యం సరఫరాకు ప్రభుత్వం నవంబర్ 29, 2026 వరకు గడువు పొడిగించిందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న 24 రోజుల వ్యవధిలో పెండింగ్ బియ్యం సరఫరా పూర్తి చేసేలా ప్రతి మిల్లు తమకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

మిల్లుల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి...

30 ఏసికే ల  కంటే తక్కువ పెండింగ్ ఉన్న 20 మిల్లుల్లో పెద్దగా సమస్యలు లేవని, ఆయా మిల్లులు రోజుకు కనీసం ఒక ఏసికే చొప్పున బియ్యం సరఫరా చేసినా పెండింగ్ లక్ష్యాలను పూర్తి చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఆయా మిల్లులు ఎలాంటి జాప్యం చేయకుండా రోజువారీ సరఫరా చేపట్టి పెండింగ్‌ను పూర్తిగా క్లియర్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా 30 ఏసికే లకు పైగా పెండింగ్ ఉన్న మిల్లులు రోజుకు కనీసం 2 నుంచి 3 ఏసికే చొప్పున బియ్యం సరఫరా చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు.  ప్రస్తుతం ఆ స్థాయిలో సరఫరా చేయడం కొంత కష్టంగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సరఫరా వేగాన్ని పెంచాలని స్పష్టం చేశారు.

పెండింగ్ బకాయిల పరిష్కారానికి సహకారం దిచ్‌పల్లి పరిధిలోని 12 మిల్లులతో పాటు ఇతర మిల్లులకు పెండింగ్ బియ్యం సరఫరా, సంబంధిత బకాయిల క్లియరెన్స్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల సమస్యలను పరిశీలించి, పెండింగ్ బకాయిల పరిష్కారానికి అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి రైస్ మిల్లర్ సీఎంఆర్ బియ్యం సరఫరాను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, గడువులోగా పెండింగ్ మొత్తాన్ని పూర్తిగా సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గడువు తర్వాత డిఫాల్ట్ మిల్లులుగా పరిగణన...

నిర్దేశించిన గడువును ప్రతి మిల్లర్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 29, 2026లోగా పెండింగ్ సీఎంఆర్ బియ్యం సరఫరా పూర్తి చేయాలని, నవంబర్ 30 నాటికి కూడా బియ్యం సరఫరా చేయని మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.

గడువు పొడిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని మిల్లర్లు తమ పెండింగ్ బియ్యం సరఫరా లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, డిఎస్వో జితేందర్ రెడ్డి, డిఏం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారి, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు