అంబరాన్నింటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 11:01pm

బెల్లంపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో(Telangana culture and traditions) భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ పీజీ కళాశాలలో(Bellampalli Degree and PG College) అంబరాన్నంటాయి. కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు,అధ్యాపకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముందస్తుగా చేపట్టిన బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో ఆకట్టుకున్నాయి.

మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. ప్రిన్సిపాల్ ఇతర అధ్యాపకులు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ ఆటను ప్రారంభించారు. బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పాటలు నృత్యాలతో ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు