పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసుల తనిఖీలు
మహబూబాబాద్ (విజయక్రాంతి): నేర నియంత్రణ, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా మహబూబాబాద్ సీఐ రఘునందన్ రెడ్డి(CI Raghunandan Reddy) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, ఇతర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాన్ని ఉపయోగించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలించారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, వారి ప్రస్తుత కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే దిశగా చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, జేబుదొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను గుర్తించి, అవసరమైన మేరకు వారి వివరాలను సేకరించి, చట్ట ప్రకారం పరిశీలిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు తిరిగి నేరాలకు పాల్పడకుండా నిరోధించడం, నేరాల ప్రణాళికలను ముందుగానే గుర్తించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ పేర్కొన్నారు.