సంక్షేమ పథకాలే బలం
- ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
- సర్వోత్తమ్‌రెడ్డిని మెజారిటీతో గెలిపించాలి
- కాంగ్రెస్ శ్రేణులతో డిప్యూటీ సీఎం భట్టి
- గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని(MLC candidate Ramreddy Sarvottamreddy) భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఖమ్మం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించి, వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలను ఇంటింటికీ వివరించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, దాదాపు కోటి 6 లక్షల కుటుంబాలకు చెందిన 3 కోట్ల 42 లక్షల మందికి ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సుమారు 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం అందించామన్నారు.
గృహజ్యోతి పథకం కింద సుమారు 53 లక్షల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక భద్రతలో భాగంగా సుమారు 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కరపత్రాల రూపంలో రూపొందించి ప్రతి ఇంటికీ అందించాలని భట్టి విక్రమార్క పార్టీ నాయకులకు సూచించారు. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్నారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి నాయకుల కుటుంబం పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలిచిందన్నారు.
సర్వోత్తమ్ రెడ్డిని కేవలం ఒక అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా భావించి ఆయన విజయం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సర్వోత్తమ్‌రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయి, కోరం కనకయ్య ప్రసంగించారు. ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.