RBI కీలక నిర్ణయం

10-10-2026 | 02:11pm

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగానికి చెందిన మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలకు అవసరమైన రోజువారీ డాలర్లను ప్రత్యేక విండో ద్వారా అందించనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలకు అక్టోబర్ 12 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.96.71 వద్ద ముగిసింది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో క్రమశిక్షణ పెంచేందుకు RBI మరికొన్ని నిబంధనలను కూడా ప్రకటించింది. రూపాయికి సంబంధించిన కొన్ని Forex Derivatives లావాదేవీలపై పరిమితులు కఠినతరం చేయడంతో పాటు, ఆధారిత లావాదేవీల వివరాలు చూపకుండా చేసే కొన్ని కరెన్సీ డెరివేటివ్ లావాదేవీల పరిమితిని 100 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ చర్యలతో మార్కెట్‌లో అనవసర ఒడిదుడుకులను నియంత్రించి, విదేశీ మారక లావాదేవీల్లో పారదర్శకతను పెంచాలని RBI లక్ష్యంగా పెట్టుకుంది. 

మరిన్ని వార్తలు