ఎంఎస్‌ఎంఈలకు చేయూత

11-10-2026 | 05:10am
  1. మార్గనిర్దేశం చేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  
  2. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్
  3. నగరంలోని పారిశ్రామిక వాడల అభివృద్ధికి చర్యలు 
  4. ఎల్ యూబీ ఎంఎస్‌ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను(Centre of Excellence) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడుల అనుసంధానం తదితర అంశాల్లో ఎంఎస్‌ఎంఈలకు మార్గ నిర్దేశం చేస్తామన్నారు.

లఘు ఉద్యోగ్ భారతి(తెలంగాణ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో శనివారం నిర్వహించిన ‘ఎల్ యూబీ ఎంఎస్‌ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్‘ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలు లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు.

దేశంలోనే తొలిసారిగా ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. క్షేత్రస్ధాయిలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలు చూపించేందుకు నెలకోసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని వివరించారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యత, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై ఎంఎస్‌ఎంఈలు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ బీఐ ఎండీ రామ్మోహన్ రావు, లఘు ఉద్యోగ్ భారతి(తెలంగాణ) ప్రతినిధులు వై.వెంకటేశ్వర్లు, కే.నరేంద్రనాథ్ దత్, ఓం అనూజ్ ఖదేల్వాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు