పట్నం ఖాళీ.. పల్లెబాట పట్టిన జనం!

11-10-2026 | 05:10am
  1. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కిటకిట
  2. ప్రైవేట్ దందాపై ప్రయాణికుల ఆగ్రహం

హైద్రాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): దసరా పండుగ(Dasara Festival) వేళ భాగ్యనగరం ఒక్కసారిగా బోసిపోతున్నది. నిత్యం రద్దీతో, వాహనాల హోరుతో కిక్కిరిసిపోయే హైదరాబాద్ ప్రధాన రహదారులన్నీ(main roads of Hyderabad) ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో నగరవాసులు కుటుంబసమేతంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యే వాహనదారులకు దసరా సెలవులు పెద్ద ఊరటనిచ్చాయి.

రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో నగరంలో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. అయితే, సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కష్టాలు తప్పడం లేదు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ తో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బస్సులు, రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్‌ఆర్టీసీ దాదాపు 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ ఆర్టీసీ అదనపు సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకు వెళ్లేవారికి బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రద్దీకి తగినట్లుగా మరిన్ని సర్వీసులు నడపాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్కపోవడం, రద్దీ కారణంగా చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణ ధరలకంటే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా, లగేజీ పేరుతోనూ అదనపు మొత్తాలు గుంజుతున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 


మరిన్ని వార్తలు