దసరా వైభోగం

11-10-2026 | 05:15am

శక్తి స్వరూపిణి సన్నిధిలో శరన్నవరాత్రి శోభ వరంగల్ భద్రకాళి ఆలయంలో విజయదశమి వైభవం

మహబూబాబాద్, విజయక్రాంతి: ప్రసిద్ధి గాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో(Warangal Bhadrakali Temple) దసరా ఉత్సవాలు అంటే భక్తిభావానికి, ఆధ్యాత్మిక వైభవానికి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక. శరన్నవరాత్రుల వేళ అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తజన సందోహం, ఆలయంలో విశేష పూజలు, అలంకరణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేస్తాయి. విజయదశమి వేళ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అమ్మవారిని ఆరాధిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

చెడుపై మంచి విజయానికి ప్రతీక

దుర్గాదేవి ఆరాధనలో విజయదశమికి విశిష్టమైన స్థానం ఉంది. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ప్రజలు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, పండుగ ఉత్సాహాన్ని అందిస్తూ ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నాయి.

పదకొండు రోజులు.. ఆధ్యాత్మిక సందడి

వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక శోభను అద్దే చారిత్రక శ్రీభద్రకాళి దేవస్థానం ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, యాగాలు, అమ్మవారి విశేష అలంకరణలు, వాహన సేవలు, విజయదశమి సందర్భంగా ఆయుధ, శమీపూజలు, తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అలంకారాల్లో అమ్మవారి దివ్యదర్శనం

నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక అలంకారంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. బాలాత్రిపురసుందరి నుంచి దుర్గాదేవి, మహిషాసురమర్ధిని వంటి రూపాల్లో అమ్మవారి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వేదమంత్రాల పఠనం, అభిషేకాలు, అర్చనలు, హోమాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారనున్నాయి. 

ప్రత్యేక ఏర్పాట్లు

దసరా ఉత్సవాలు కేవలం పూజలకే పరిమితం కావు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం, పండుగ వేళ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకోవడం ఓరుగల్లు ప్రజల సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలంకరణ, రాకపోకల నిర్వహణపై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 బండి సంపత్ కుమార్, 

భద్రకాళి.. సువర్ణ శోభితం

దేవీ శరన్నవరాత్రి వేడుకల ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం భద్రకాళి అమ్మవారిని బండారితో అభిషేకించారు. మూల విరాట్టుకు ప్రత్యేకంగా పసుపుతో అభిషేకం నిర్వహించడంతో పూర్తిగా పసుపు వర్ణ శోభితమై హరిద్రాదేవిగా దర్శనమిచ్చారు.

ఉగ్రరూపంలో ఉండే భద్రకాళిని పరమశాంత స్వరూపిణిగా, త్రిపుర సుందరిగా, మంగళప్రదమైన తల్లిగా భక్తులు ఆరాధించారు. హరిద్ర రూపాన్ని దర్శించుకోవడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, కుటుంబంలో సౌభాగ్యం, ఆరోగ్యం, ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారికి అభిషేకించిన పసుపును భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు.

మరిన్ని వార్తలు