ఈయూ కూటమికే పట్టం!
- ఆర్టీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తున్నాం
- ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న ధీమా
- త్వరలోనే సీఎంను కలిసి ఆర్టీసీ విలీనంపై చర్చిస్తామని వెల్లడి
- బస్‌భవన్ వద్ద నేతల సంబురాలు
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(Telangana Mazdoor Union) (టీఎంయూ), నేషనల్ మజ్జూదర్ యూనియన్ (ఎన్‌ఎంయూ)(National Mazdoor Union) కూటమి దాదాపు ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలువబోతున్నదని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ గురించి చర్చిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బస్ భవన్ వద్ద ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి నేతలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈదురు వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమైందన్నారు.
పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ‘ఇంతకాలం తర్వాత ఎన్నికలు జరిగినప్పటికీ కార్మికులు మా కూటమి వైపే మద్దతుగా నిలిచి విజయాన్ని అందించారు. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న హామీల పరిష్కారంపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చింస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగ భద్రతతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇతర కూటమి నేతలు ధన బలంతో కార్మికులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
17న అధికారిక ప్రకటన
ఈ నెల 9న విధుల్లో ఉన్న డ్రైవర్లు ఓటు వేయనందున ఈ నెల 14, 15న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. కాగా, తాము మద్దతు ఇచ్చిన టీడబ్ల్యూయూ సంఘం ఓడిపోతుండటంపై పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆర్టీసీ కార్మికుల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో మొత్తం 12 సంఘాలు మూడు కూటములుగా బరిలో నిలిచాయి.