ఈ సర్పంచ్ ఆటో డ్రైవర్!

11-10-2026 | 05:25am

(జుక్కల్, విజయక్రాంతి): ఓ ఆటో డ్రైవర్(Auto-rickshaw driver) తన గ్రామ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా అతడ్ని సర్పంచుగా ఎన్నుకున్నారు. సర్పంచుగా  ప్రజలకు సేవ చేస్తూనే తన జీవనాధరమైన ఆటోను నడుపుతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడే కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చండేగావ్ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్. కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ వచ్చిన లక్ష్మణ్.. ఇటీవల కలిసొచ్చిన రిజర్వేషన్‌తో సర్పంచుగా పోటీ చేసి గెలిచాడు.

పదవి వచ్చిన తర్వాత కూడా తన వృత్తిని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ మండల కేంద్రానికి ఏదైనా పని మీద రావాల్సి వస్తే తన ఆటోను తానే నడుపుకుంటూ వస్తుంటారు. అవసరమైతే జుక్కల్ మండల కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూడా అదే ఆటోలో వెళ్లి వస్తుంటారు.

అత్యవసర వేళల్లో ఉచిత సేవ

లక్ష్మణ్ ప్రత్యేకత కేవలం ఆటో నడపడం, సర్పంచుగా ఉండటంలోనే లేదు. అత్యవసర సమయంలో గ్రామ ప్రజలకు అండగా నిలవడం ఆయనకు అలవాటుగా మారింది. ముఖ్యంగా ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న మహిళలను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తన ఆటోతో ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయని గ్రామస్తులు చెపుతున్నారు.

ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా.. అవసరమైన సమయంలో తిరిగి వారిని ఇంటికి కూడా చేర్చుతుంటారు. ఇందుకు ఎలాంటి డబ్బులు ఆశించకుండా సేవ చేయడం ఆయన ప్రత్యేకత.

పదవి వచ్చినా.. సాధారణ జీవితం

సర్పంచుగా ఎన్నికైన తర్వాత కూడా లక్ష్మణ్ జీవనశైలిలో పెద్దగా మార్పు కనిపించదు. కొత్తగా ఆయనను చూసే వారికి అసలు ఈయనే గ్రామ సర్పంచ్ అని గుర్తించడం కూడా కష్టమేనని స్థానికులు అంటున్నారు. సాధారణ దుస్తుల్లో, అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన.. గ్రామంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. చిన్నపిల్లలు, యువతతో స్నేహంగా మెదులుతారు.

లక్ష్మణ్ విషయంలో సర్పంచ్ పదవి కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే ముఖ్యంగా కనిపిస్తోందని గ్రామస్తులు చెపుతున్నారు. రాజకీయ పదవి వచ్చిన తర్వాత వృత్తిని, సాధారణ జీవనశైలిని పక్కన పెట్టకుండా తనకు చేతనైన విధంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్న లక్ష్మణ్ ప్రస్తుతం ఆటో సర్పంచ్‌గా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

 విజయ్‌కుమార్ 

మరిన్ని వార్తలు