శక్తి స్వరూపిణి.. జోగుళాంబ!

11-10-2026 | 05:20am
  1. శరన్నవరాత్రులకు అలంపూర్ క్షేత్రం సిద్ధం
  2. నేటి నుంచి పదిరోజులపాటు అమ్మవారికి విశేష పూజలు
  3. రోజుకో అలంకరణలో దర్శనం
  4. 16న బాలబ్రహ్మేశ్వర స్వామివారి కల్యాణం
  5. 20న విజయదశమి వేడుకలు

అలంపూర్, అక్టోబర్ 10: శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీ అలంపూర్ ముస్తాబవుతోంది. తుంగభద్ర నదీ తీరాన కొలువైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో(Alampur's Jogulamba Balabrahmeswara Swamy Temple) ఆదివారం నుంచి ఈ నెల 20 వరకు పది రోజులపాటు దసరా శరన్నవ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రోజుకో అలంకరణలో దర్శనమివ్వనున్న జోగుళాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. 

రోజుకో రూపం.. అమ్మవారి వైభవం

నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించడం విశేషం. ఈ నెల 11న శైలపుత్రీదేవి అలంకరణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 12న బ్రహ్మచారిణి దేవి, 13న చంద్రఘంట దేవి, 14న కూష్మాండదేవి, 15న స్కందమాతదేవి, 16న కాత్యాయనీ దేవి, 17న కాలరాత్రి దేవి, 18న మహాగౌరి దేవి, 19న సిద్ధిధాత్రీదేవి రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి రోజూ ప్రత్యేక అర్చనలు, హోమాలు, హారతులతో అమ్మవారిని కొలవనున్నారు.

16న జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు అమ్మవారికి సింహవాహన సేవ జరగనుంది. 18న దుర్గాష్టమి సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు. 20న విజయదశమి వేడుకలతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, అవభృథ స్నానం, శమీ పూజ, నదీ హారతి, తెప్పోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధమైన ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది.

మరిన్ని వార్తలు