చెత్తకుప్ప నుంచి అందాల చెరువుగా.. తమ్మిడికుంటకు కొత్త కళ!

11-11-2026 | 07:35am

ఒకప్పుడు చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, దుర్వాసనతో నిండిపోయిన మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంది. ఆక్రమణలు, కాలుష్యం కోరల్లో చిక్కుకున్న చెరువును హైడ్రా (HYDRAA) పునరుద్ధరించి ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దింది. అభివృద్ధి చేసిన ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా హాజరుకానున్నారు.

తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణలో భాగంగా భారీ స్థాయిలో పనులు చేపట్టారు. చెరువులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడిక, చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. ఏకంగా 30 వేలకుపైగా ట్రక్కుల వ్యర్థాలను బయటకు తరలించారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో దుర్వాసన సమస్య తగ్గింది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా ఈ పునరుద్ధరణ దోహదపడనుంది.

చెరువు చుట్టూ సుమారు 1.6 కిలోమీటర్ల మేర నడకదారిని (Walking Track) ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారి కోసం ఆధునిక ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆటస్థలాన్ని ఏర్పాటు చేశారు. చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు వేలాది మొక్కలు నాటారు. సందర్శకులు సేదతీరేందుకు కూర్చునే ప్రదేశాలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

తమ్మిడికుంట చెరువు అభివృద్ధి కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. గతంలో ఇదే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఎన్-కన్వెన్షన్ కేంద్రాన్ని హైడ్రా కూల్చివేయడంతో నాగార్జున పేరు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే చెరువు పునరుద్ధరణ కార్యక్రమానికి ఆయన హాజరవుతుండటం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

చెరువుల పునరుద్ధరణలో భాగంగా గుడిసెలు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధి పనుల సమయంలో గుడిసెలు కోల్పోయిన 34 మంది బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. తమ్మిడికుంట అభివృద్ధి పనుల వల్ల ఎఫ్‌టీఎల్ పరిధిలో నివాసాలు కోల్పోయిన అర్హులైన బాధితులకు కూడా ఇళ్ల పత్రాలు పంపిణీ చేయనున్నారు.

హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి రద్దీ ప్రాంతాల మధ్య తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణతో స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. చెరువుల పరిరక్షణతో పాటు ప్రజలకు వినోదం, వ్యాయామం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా హైడ్రా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది.

ఒకప్పుడు దుర్వాసనతో ఇబ్బంది పెట్టిన చెరువు.. ఇప్పుడు ఆహ్లాదాన్ని పంచే వినోద కేంద్రంగా మారింది. చెరువుల పరిరక్షణతో పాటు పేదలకు ఇళ్ల భరోసా కల్పించే కార్యక్రమంగా తమ్మిడికుంట ప్రారంభోత్సవం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు