ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోనూ భారత్ సీన్ రిపీట్

11-11-2026 | 07:22am

ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ కసరత్తులు కొనసాగుతున్న వేళ పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జాతీయ గీతం ‘హతిక్వా’ (Hatikvah National Anthem) ఆలపించే సమయంలో అరబ్ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. జాతీయ గీతం పట్ల గౌరవం చూపకుండా వాకౌట్ చేయడం ఏమిటంటూ నెతన్యాహు మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇజ్రాయెల్ 26వ పార్లమెంట్ (26th Knesset) ప్రారంభ సమావేశం నవంబర్ 10న జెరూసలేంలో జరిగింది. మొత్తం 120 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో జాయింట్ లిస్ట్‌కు చెందిన పలువురు అరబ్ ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతం ఆలాపన సమయంలో నిలబడాల్సిన పరిస్థితిని నివారించేందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అయితే రామ్ పార్టీ అధినేత మన్సూర్ అబ్బాస్‌తో పాటు మరికొందరు ఎంపీలు సభలోనే ఉండటం గమనార్హం. ఈ పరిణామంతో సభలోని ఇతర సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ కుడిపక్ష నేతలు విమర్శలు చేశారు.ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల అనంతరం ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 120 స్థానాలున్న పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు ఉండగా, అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్, రామ్‌లకు కలిపి 19 స్థానాలు లభించాయి.

ఈ నేపథ్యంలో అరబ్ పార్టీల మద్దతు ఐసెన్‌కోట్ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారింది. అయితే ఈ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకోవాలా? లేక బయట నుంచి మద్దతు తీసుకోవాలా? అనే అంశంపై ప్రతిపక్ష కూటమిలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పార్లమెంట్ ప్రారంభ సమావేశంలోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జాయింట్ లిస్ట్ నేత యూసుఫ్ జబరీన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు అరబ్ పార్టీలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ వెలుపల కూడా నిరసనలు జరిగాయి.

ఒకవైపు నెతన్యాహు వర్గం అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరోవైపు ఐసెన్‌కోట్ మెజారిటీని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 8న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. అరబ్ పార్టీల మద్దతు లేకుండా 61 మంది సభ్యుల బలాన్ని సాధించడం కష్టంగా మారడంతో రాజకీయ చర్చలు మరింత ఆసక్తికరంగా మారాయి. 

జాతీయ గీతం వేళ జరిగిన వాకౌట్ ఇప్పుడు కేవలం పార్లమెంటరీ ఘటనగానే కాకుండా, ఇజ్రాయెల్ రాజకీయాల్లో అరబ్ పార్టీల ప్రాతినిధ్యం, జాతీయ గుర్తింపు, ప్రభుత్వ ఏర్పాటులో వాటి పాత్ర చుట్టూ సాగుతున్న విస్తృత చర్చకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా జాయింట్ లిస్ట్ (Joint List) ఎంపీల తీరుపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. 


మరిన్ని వార్తలు