రాహుల్‌గాంధీకి తెలంగాణ అడ్డా కాదు!

11-11-2026 | 05:20am
  1. ప్రజలను మోసం చేసి గాంధీ కుటుంబం కోసం ఖజానా ఖాళీ చేస్తారా?
  2. హామీలకు లేవని రాహుల్ సభల కోసం కోట్లు కుమ్మరిస్తారా?
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

నవంబర్ 10 (విజయక్రాంతి): ఎన్నికల హామీలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్, తెలంగాణ ప్రజల సొమ్ముతో రాహుల్ గాంధీని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీద నిలబెట్టేందుకు తాపత్రయపడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(BJP State President N. Ramchander Rao) మండిపడ్డారు. ఎన్నిసార్లు ఫెయిలైనా రాహుల్ గాంధీని మళ్లీ రీలాంచ్ చేయడానికి రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు.

తెలంగాణ ప్రజల పన్నులతో రాహుల్ గాంధీ రాజకీయ ఉనికిని బతికించడానికి కాంగ్రెస్ పడుతున్న ఆరాటం తప్ప ఇందులో మరొకటి లేదన్నారు. ఈమేరకు మంగళవారం రాంచందర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒకపక్క రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, పెండింగ్ బిల్లులు కట్టడానికి, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రూపాయి లేదంటారు.

మరి రాహుల్ గాంధీ ఆర్భాటాల కోసం ఖజానా తలుపులు ఎలా తెరుచుకుంటున్నాయి? తెలంగాణ ప్రజల కష్టార్జితం గాంధీ కుటుంబానికి రాజకీయ పునరావాసం కల్పించడానికా?’ అని రాంచందర్ రావు నిలదీశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్ గాంధీకి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తు చేశారు. ‘ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల జాడే లేదు. కొలువులు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది’ అని విమర్శించారు. 

రైతులకు రావాల్సిన ‘రైతు బంధు’ సాయం ఇంతవరకు ఖాతాల్లో పడలేదని పేర్కొన్నారు.‘ ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల  పెన్షన్ల చెల్లింపులకు డబ్బులు లేవని సాకులు చెప్పే ప్రభుత్వం.. రాహుల్ గాంధీ కార్యక్రమాలకు మాత్రం వందల కోట్లు ఎక్కడి నుంచి తెస్తోంది. నాలుగు కోట్ల ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తున్నారు.  రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం తక్షణమే ఆపాలి. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయాలి. ఉద్యోగ హామీలు నెరవేర్చాలి. రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. ఉద్యోగుల పెండింగ్ డీఏలు, రిటైర్‌మెంట్ బకాయిలను వెంటనే జమ చేయాలి..’ అని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.  

మరిన్ని వార్తలు