కౌలు రైతు కుదేలు!

11-11-2026 | 05:25am
  1. ‘భరోసా’ లేదు..  గుర్తింపు కార్డులు లేవు..  
  2. కౌలు చట్టం అమలుకాదు.. నష్టపరిహారం రాదు
  3. ఎల్ నినో పరిస్థితుల్లో కౌలు రైతుల అరిగోస!

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కౌలు రైతుల(Telangana Tenant Farmers) బతుకులు అత్యంత దయనీయంగా మారాయి. కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు(Crops) దెబ్బతింటే వీరికి కంటితుడుపుగానైనా నష్టపరిహారం అందడం లేదు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు కౌలుదారులను మరింత కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ. 6 వేల చొప్పు న మొత్తం రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకం పట్టాదారులకే పరిమితం కావడంతో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరుతో పెట్టుబడి సాయం అందించినా.. ప్రయోజనం పొందింది భూ యజమానులే తప్ప కౌలు రైతులకు దక్కింది శూన్యం.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా.. వారిలో 22 లక్షలకు పైగా కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కౌలుదారులకు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందకపోవడంతో సాగు భారమంతా అప్పులపైనే మోయాల్సి వస్తోంది.

పంట నష్టాలు తోడవడంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కూడా కేంద్రానికి  పంపింది. కేంద్రం, రాష్ట్రం సాయం ప్రక టిస్తే తమకు పరిహారం వర్తిస్తుందో, లేదోనని కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కౌలు రైతులు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున భూ యజమానికి ముందస్తుగానే చెల్లించి సాగు చేస్తారు. వాస్తవ సాగుదారుడు కౌలు రైతులు అయినప్పటికీ సాంకేతిక, ప్రభుత్వ నిబంధనల వల్ల సహాయం భూ యజమానులకే దక్కుతోంది. అత్యధిక శాతం కౌలు ఒప్పందాలు నమ్మకం, నోటి మాట ద్వారా జరుగుతుంటాయి.

ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు ఉండవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు కార్డులు జారీ కాకపోవడం, భూ యజమానులు కూడా అందుకు అంగీకరించకపోవడం అడ్డంకిగా మారుతోంది. తమ భూములపై కౌలుదారులకు హక్కులు వస్తాయనే భయంతో చాలా మంది యజమాను లు అధికారికంగా కౌలు పత్రాలపై సంతకాలు చేయడం లేదు.

దీంతో కౌలు రైతులు రైతుభరోసా, పంట రుణాలు, ఇన్సూరెన్స్, కరువు నష్టపరిహారం వంటి  ప్రయోజనాల కు దూరమవుతున్నారు.  కౌలు రైతుల గుర్తింపుకోసం చట్టం తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని రైతు సంఘా లు ఆరోపిస్తున్నాయి. దిగుబడి రాక, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీల రాయితీని రైతులకు ప్రకటించడం అభినందనీయమని, అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

శ్రమ కౌలు రైతుది.. సాయం యజమానులకు 

ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు ఎండిపోయి కౌలు రైతులు భారీగా నష్టపోయారు. అయితే ప్రభుత్వాలు అందించే కరువు సహాయం, పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలు అసలైన సాగుదారులైన కౌలు రైతులకు అందకుండా భూ యజమానుల ఖాతాల్లోకే వెళ్లే అవకా శం ఉందని కౌలు రైతులు అంటున్నారు.

ప్ర స్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి వంటి ప్రధాన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. ప్రభు త్వం ఇచ్చే పరిహారం నేరుగా కౌలుదారుకే ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

పంట నష్టం రికార్డుల్లో భూ యజమానుల పేర్లే.. 

కౌలు రైతులు ముందుగానే భూమి కౌలు చెల్లించి పంట సాగుకు పెట్టుబడులు పెట్టినప్పటికీ ప్రభుత్వపరంగా ప్రయోజనాలు పొం దలేకపోతున్నారు. పంట రుణాలు కూడా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కరువు మండలాల్లో వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటలను అంచనా వేస్తున్నారు.

కానీ,  పరిహారం మాత్రం కౌలు రైతులకు చెందకుండా రికార్డుల్లో సాగు చేయని భూమి యజమానుల పేర్లు నమోదు చేస్తున్నారు. ఇదేమని అడిగితే భూ యజమానుల నుంచి పత్రం తీసుకురమ్మంటున్నారని కౌలు రైతులు వాపోతున్నా రు. అయితే భూ యజమానులు మాత్రం కౌలు పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తే మరోసారి సాగు చేసేందుకు భూమి కౌలుకు ఇస్తారో లేదోనని రైతులు వెనుకడుగు వేస్తున్నారు. 

ప్రభుత్వం స్పందించాలి

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం నేరుగా వా రికే అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. భూమిలేని కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారికి రైతుబీమా కూడా అందడం లేదని, విచారణ కూడా నామమాత్రంగా చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ప్ర జాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం, రుణ అర్హత కార్డులు, రైతుబీమా, ఉచిత విత్తనాలు అందించాలని, ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల్లో, సహకార సంస్థల్లో రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు