తొందరపాటు వద్దు!

11-11-2026 | 05:25am
  1. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై జాగ్రత్త అవసరం
  2. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావద్దు
  3. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి
  4. సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలి
  5. డిండి, అచ్చంపేట పనులు వేగవంతం చేయాలి
  6. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం 
  7. నీటిపారుదల శాఖపై సమీక్షలో పలు సూచనలు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి) : కాళేశ్వరం(Kaleshwaram) అదనపు టీఎంసీ పనుల(TMC works) విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నందున అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సమర్పించాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి న్యాయ నిపుణులతో చర్చించారు.

డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని అందించాలని తెలిపారు. ఈ రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని చెప్పారు.

ఎక్కడ టన్నెల్, ఎక్కడ కాలువ అవసరమో గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

మరిన్ని వార్తలు