కేటీఆర్ చొరవతో స్వదేశానికి లక్ష్మి!

03-11-2026 | 04:53pm

హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్(Gulf) దేశానికి వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న తెలంగాణ మహిళ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి(Tupudu Lakshmi) కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 12న కొడంగల్ నుంచి మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తల్లి ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న కుమారుడు రాజు సెప్టెంబర్ 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)ను కలిసి పరిస్థితిని వివరించారు.

రాజు విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్, లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మస్కట్‌(Muscat)లోని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆమె తిరిగి వచ్చేలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో చేపట్టిన ప్రయత్నాలు ఫలించడంతో లక్ష్మి స్వదేశానికి చేరుకున్నారు.

మస్కట్‌ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న లక్ష్మి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచి స్వదేశానికి చేరుకునేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా మహిళా కార్మికుల భద్రతకు సంబంధించిన సమస్యలను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు