పసిబిడ్డకు అమ్మలా కానిస్టేబుల్

03-11-2026 | 03:15pm

ఖాకీ చాటిన మాతృత్వం.

విధి నిర్వహణలోనే కాదు.. మానవత్వంలోనూ ముందడుగు

చంటి బిడ్డతో వచ్చిన బాధితురాలికి అండగా నిలిచిన దీప

హైదరాబాద్,(విజయక్రాంతి): ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన విధి నిర్వహణే కాదు.. ఆప్యాయతతో కూడిన అమ్మ మనసు కూడా ఉంటుందని చాటిచెప్పారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప(Constable Deepa). ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు(POCSO court)కు చంటి బిడ్డతో విచారణకు వచ్చిన ఓ బాధితురాలు బిడ్డను చూసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని దీప గమనించారు. వెంటనే మానవీయంగా స్పందించి ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లికి అండగా నిలిచారు.

ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ఓ తల్లికి ఎదురైన ఇబ్బందిని తన బాధ్యతగా భావించి చిన్నారిని అక్కున చేర్చుకున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది. యూనిఫామ్‌లో ఉన్నా.. ఆమెలోని అమ్మతనం ఆ పసిబిడ్డకు భరోసానిచ్చింది. చట్టాన్ని కాపాడే చేతులే ఆప్యాయతతో పసిబిడ్డను ఎత్తుకున్న ఈ దృశ్యం న్యాయవాదులు, పోలీసు సిబ్బంది మనసులను హత్తుకుంది. కానిస్టేబుల్ దీప చూపిన మానవత్వాన్ని పలువురు అభినందించారు. ఖాకీ అంటే కేవలం క్రమశిక్షణ కాదు.. అవసరమైన వేళ ఆపన్నులకు అండగా నిలిచే మానవత్వం కూడా అని దీప నిరూపించారు.

మరిన్ని వార్తలు