లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఏఈవో

03-11-2026 | 03:41pm

సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) మరోసారి కొరడా ఝళిపించింది. ఎరువుల వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే లంచం(Bribe) ఇవ్వాల్సిందేనంటూ డబ్బులు డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయాధికారి(Sadashivpet Agriculture Officer) జి. రమేశ్ ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం తన కార్యాలయంలో రూ.20 వేల నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారం సజావుగా సాగేందుకు సహకరిస్తానంటూ రమేశ్ మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గత అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకుని, అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు తన అధికారిక విధులను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ పేర్కొంది.

అధికారిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వ్యక్తిగత వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064ను అందుబాటులో ఉంచింది. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో 'Telangana ACB', ఎక్స్ ఖాతా @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు