సందడిగా బాలోత్సవ్
జానపద నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శనలు హైలెట్
ఖమ్మం టౌన్ నవంబర్ 27 విజయక్రాంతి: బివికె ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో(Meeting Hall) రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. రెండో రోజు శుక్రవారం ఐదు అంశాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జానపద నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జానపద నృత్యాల్లో ఉత్సాహం
జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన జానపద నృత్య పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ పోటీలకు లారెన్స్, భరత్, రవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
మానవ సంబంధాలపై కథలు
జూనియర్స్ విభాగంలో నిర్వహించిన కథలు చెప్పే పోటీల్లో చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు, మంచి అలవాట్లు, మానవ సంబంధాలు తదితర అంశాలపై కథలు చెప్పారు. హావభావాలతో కథలను వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పోటీలకు రిటైర్డ్ ఉపాధ్యాయులు రౌతు రవి, ఉరిమళ్ల సునంద, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాళ్లూరి లక్ష్మి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆకట్టుకున్న బెస్ట్ ఫ్రమ్ వేస్ట్
పనికిరాని వస్తువులతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసే బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ పోటీలో విద్యార్థులు సృజనాత్మకతను చాటారు. పాత టైర్లతో తాబేలు బొమ్మను తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పనికిరాని వస్తువులతో స్మార్ట్ విలేజ్ నమూనాను రూపొందించి ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
స్పెల్బీ పోటీల్లో ఉత్సాహం
స్పెల్బీ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆంగ్ల పదజ్ఞానాన్ని పరీక్షించుకున్నారు. ఈ పోటీలకు ఎస్కె అక్రమ్, శ్రీదేవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆలోచింపజేసిన ఫ్యాన్సీ డ్రెస్ షో
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, అన్నదాత తదితర వేషధారణల్లో చిన్నారులు అలరించారు. భవిష్యత్తులో మానవుడు ఎలా ఉంటాడనే అంశంపై ఓ విద్యార్థి ప్రదర్శించిన వేషధారణ ఆలోచింపజేసింది.
నేడు విజేతలకు బహుమతుల ప్రదానం
రెండు రోజుల పాటు పది అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు శనివారం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు బాలోత్సవ్ కన్వీనర్ వై.శ్రీనివాసరావు, కో ఆర్డినేటర్ కె.హిమబిందు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బివికె సభ్యులు వాసిరెడ్డి వీరభద్రం, కళ్యాణం నాగేశ్వరరావు, తుమ్మల వెంకట్రావు, ఎన్.గోవిందరావు, జి.రామారావు, అప్జల్మియా, సామినేని నాగేశ్వరరావు, ఎస్కె ఎహ్మద్జాన్, నెల్లూరి వీరబాబు, ఎం.సుబ్బారావు, టి.శివన్నారాయణ, మోహన్, గుంటుపల్లి శ్రీదేవి, సిహెచ్.వెంకటేశ్వరరావు, వై.రవికుమార్, అనుమతి, పుచ్చకాయల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.