నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ
నర్సంపేట, అక్టోబరు 26 (విజయక్రాంతి): తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లలాడుతున్న నల్లబెల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి(District Council Member Chintakindi Kumaraswamy) డిమాండ్ చేశారు. సోమవారం నల్లబెల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణా రెడ్డి, తహసీల్దార్ ముప్పు కృష్ణకు మండల సహాయ కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్‌తో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వర్షాలు లేక పంటల విస్తీర్ణం తగ్గడమే కాకుండా వేసిన పంటలు కూడా నీరందక ఎండిపోతున్నాయని, రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 31న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపే కరువు జాబితాలో నల్లబెల్లిని చేర్చేలా జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక పంపాలని అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతాంగానికి, ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.