అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

26-10-2026 | 06:18pm

హనుమకొండ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సమాజంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిజాయితీ, నైతిక విలువలు, పారదర్శకతను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న అవినీతి నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిచే అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య సుంకరి జ్యోతి మాట్లాడుతూ అవినీతి వల్ల సమాజ అభివృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వహిస్తూ, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. రెహమాన్, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు