ధర్మం, సత్యం, మానవతకు ప్రతీక మహర్షి వాల్మీకి

26-10-2026 | 06:14pm

పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

శ్రీరంగాపూర్: ఆదికావ్యం రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మమార్గాన్ని బోధించిన ఆదికవి మహర్షి వాల్మీకి(Maharshi Valmiki) అని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. సోమవారం నాడు మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని వనపర్తి జిల్లా(Wanaparthy District) శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని మహర్షి వాల్మీకి మందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని వాల్మీకి మహర్షికి నివాళులర్పించి, ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోయవాడిగా ఉన్న రత్నాకరుడు నారద మహర్షి బోధనతో తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా మారారని తెలిపారు. తన అపార జ్ఞానం, తపోశక్తితో రామాయణం వంటి మహాగ్రంథాన్ని రచించి ప్రపంచానికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. రామాయణం ధర్మం, న్యాయం, త్యాగం, సత్యం, భక్తి, మానవతా విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆదర్శ జీవితం, సీతమ్మ త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

వాల్మీకి కేవలం ఆదికవి మాత్రమే కాకుండా, సమాజానికి మార్గదర్శకుడని తెలిపారు. యువత రామాయణాన్ని చదివి అందులోని నీతిని తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాల్మీకి స్ఫూర్తితో పేద విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రామాయణం తెలుగు భాషలోకి అనువాదమై ప్రజలకు మరింత చేరువైందని పేర్కొంటూ, మహర్షి వాల్మీకి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పృథ్వీరాజ్, శ్రీనివాస్ గౌడ్, వాల్మీకి సంఘం నాయకులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు