మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు!
-ముగ్గురు విదేశీ మహిళలకు విముక్తి!
శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని ఓరియన్ ఎలిగెంట్ సర్వీస్ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాలపై మాదాపూర్ పోలీసులు(Madhapur Police), కూకట్పల్లి ఎస్ఓటీ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను రక్షించారు. ఈ నెల 25న రాత్రి సర్వే ఆఫ్ ఇండియా కాలనీ, చంద్రనాయక్ తండాలోని అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 201లో తనిఖీలు చేపట్టగా వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయక్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలిస్తున్నారు. రక్షించిన ముగ్గురు మహిళలను న్యాయస్థానంలో హాజరుపరిచి, పునరావాసం కోసం ఆశ్రయ గృహానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సర్వీస్ అపార్ట్మెంట్ యజమానులు, నిర్వాహకులు గదులు అద్దెకు ఇచ్చే ముందు వ్యక్తుల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్ హెచ్ఓ కె.వి. సుబ్బారావు సూచించారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.