ప్రహరీ కూల్చారు.. ఇల్లు మరిచారు!
- ప్రశ్నార్ధకంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ
- పీర్జాదిగూడ సర్వే నంబర్ 199లో అక్రమ నిర్మాణాలపై చర్చ
- ప్రహరీ తొలగించి.. ఇంటిని కూల్చడంపై చర్యలేవి?
మేడిపల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల పరిరక్షణ(Protection of Government Lands), ఆక్రమణల తొలగింపులో అధికారుల చర్యలు(Actions by officials) చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలోని సర్వే నంబర్ 199లో ప్రభుత్వ భూమికి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా ఆసక్తి రేపుతున్నాయి.
ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 199లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇల్లు కూల్చివేయాలంటూ పలువురు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సంబంధిత అధికారులు అక్కడి ప్రహరీ గోడను కూల్చివేశారు.
అయితే ఇంటిని తొలగించకుండా వదిలేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ప్రహరీ గోడను తొలగించిన అధికారులు ఇంటి విషయంలో ఎందుకు తదుపరి చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ భూములను గుర్తించడం, వాటి హద్దులను పరిరక్షించడం, ఆక్రమణలు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారుల బాధ్యత. ఈ క్రమంలో సర్వే నంబర్ 199లోని భూమి స్వరూపం, హద్దులు, నిర్మాణాల స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మర్మం ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రహరీ గోడ తొలగింపునకు సంబంధించిన వివరాలు, ఇంటి విషయంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలపై అధికారులు తీరును స్థానికులు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో పారదర్శకత పాటిస్తూ, భవిష్యత్తు తరాలకు భూములు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు.. తహసిల్దార్
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇప్పటికీ ప్రాథమిక విచారణ చేపట్టి ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూల్చివేశాం. త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమ నిర్మాణం అని తేలితే కూల్చివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి తహసిల్దార్ వెంకట నరసింహారెడ్డి తెలిపారు.