రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రెండున్నరేళ్లలో జిల్లాలో 12 కొత్త విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
రూ.2.2 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భూపాలపల్లి/చిట్యాల,(విజయ క్రాంతి): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. శుక్రవారం చిట్యాల మండలం వడితల గ్రామంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.2.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని(33/11 kV electrical substation) ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత రెండున్నరేళ్లలో జిల్లాలో 12 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గోదావరి జలాలను వినియోగించుకుంటూ డీబీఎం-38 ద్వారా సాగునీరు అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సుమారు రూ.200 కోట్లతో సమీకృత నమూనా నివాస పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 14 వేల మెగావాట్ల నుంచి 21 వేల మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్ట ప్రాంతంలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. డీబీఎం-38 ద్వారా 44,770 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఎస్సారెస్పీ పరిధిలోని మరో 70 వేల ఎకరాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నూతన విద్యుత్ ఉపకేంద్రంతో ఐదు గ్రామాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించి వృథాను అరికట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, గౌడ్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సదానందం, సర్పంచ్ భగవాన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.