సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

04-11-2026 | 05:13pm
  1. ఓటీపీ, బ్యాంకు వివరాలు అపరిచితులకు చెప్పొద్దు.. ఆన్‌లైన్‌లో జాగ్రత్తలు పాటించాలి
  2. సైబర్ భద్రతపై కన్నాపూర్ పాఠశాలలో పోలీసుల అవగాహన

హుజురాబాద్, నవంబర్ 04:(విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల(Cybercrimes) పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి(Shankarapatnam SI Shekhar Reddy) సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా మంగళవారం కన్నాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులమని ఫోన్ చేసి అడిగినా ఎవరికీ ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ వివరాలు వెల్లడించకూడదన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు.

ఆన్‌లైన్ గేమ్స్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలకు ఆకర్షితులు కావద్దని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో పోలీసులమని, సీబీఐ అధికారులమని వీడియో కాల్స్ చేసి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే ముఠాల పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. యూపీఐ ద్వారా డబ్బులు స్వీకరించడానికి పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, పిన్ నమోదు చేస్తే ఖాతా నుంచి డబ్బులు బదిలీ అవుతాయని వివరించారు.

సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకు పాల్పడినా, బెదిరింపులకు గురిచేసినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మొబైల్, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. మోసానికి సంబంధించిన ఫోన్ నంబర్లు, సందేశాలు, స్క్రీన్‌షాట్‌లు, లావాదేవీల వివరాలను భద్రపరచుకోవాలని తెలిపారు.

విద్యార్థులు తాము నేర్చుకున్న సైబర్ భద్రతా విషయాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి వారిలో అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు. అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అని, ఆన్‌లైన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు