పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు

04-11-2026 | 10:38pm

పాములేరు వాగు వద్ద తెగిపోయిన డైవర్షన్ రోడ్డు

ములకలపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ములకలపల్లి మండలంలోని వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు,కుంటలు అలుగులు పోస్తున్నాయి. ములకలపల్లి- జగన్నాధపురం గ్రామాల మధ్య పాములేరు వాగు పై గత సెప్టెంబర్ నెల 23వ తేదీ కురిసిన వర్షాలకు వంతెన కుంగిపోయింది.

దాని పక్కనే 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన డైవర్షన్ రహదారి తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం ఉదయం కొంతమేర  తెగిపోయింది.దీంతో ములకలపల్లి- దమ్మపేట రహదారిలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.మండలంలోని అన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటల నుంచి బయటకు వస్తున్న వరద నీరు రహదారుల పై ప్రవహిస్తుంది.మండలంలోని ముర్రేడు,పాములేరు సాకివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మధ్య తరహా ముఖమామిడి ప్రాజెక్టు నిండి అలుగుపోస్తుంది.

అనేకచోట్ల పాఠశాలలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.ములకలపల్లి మండలంలో 238. 2% మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల కారణంగా రెండు రోజులు మండలంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పాములేరు వాగు వద్ద పోలీసులు భారీకేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. తెగిపోయిన డైవర్షన్ రహదారిని, పాములేరు వాగు ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) సందర్శించారు.స్థానిక ఎస్సై మధు ప్రసాద్, సిబ్బందికి వరద పరిస్థితిపై సూచనలు చేశారు.రెండు రోజుల నుంచి విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో జనసంచారం నిలిచిపోయింది. ఈ భారీ వర్షానికి పత్తి, వరి,పుచ్చ,వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు.

మరిన్ని వార్తలు