కరీంనగర్ సర్కిల్లో మొదలైన అప్రకటిత కోతలు
కరీంనగర్, అక్టోబరు 18 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో విద్యుత్ డిమాండ్(Electricity Demand) పెరిగింది. దీంతో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. లోటు వర్షపాతం, సుదీర్ఘ ఎండ తీవ్రత పెరగడంతో ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. త్రీఫేస్ సరఫరా నిరంతరంగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేయడంతో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల పైన అదనపు భారం పడి నోవోల్టేజితో మోటార్లు కాలిపోతున్నాయి.
డి టి ఆర్ లు కాలిపోయి విద్యుత్ సంస్థకు లక్షల్లో నష్టం సంభవిస్తుందివ్యవసాయ విద్యుత్ వినియోగంతో పాటు ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ గరిష్ఠ డిమాండ్, రోజువారీ విద్యుత్ వినియోగం సాధారణ స్థాయిలను మించిపోయాయి. భూగర్భ జలమట్టాలు తగ్గడం, పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లను నిరంతరంగా నడపాల్సి రావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏసీల వాడకంతో విద్యుత్ వినియోగం పెరిగింది.
2025తో పోలిస్తే 2026 జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం 5 శాతం మేర పెరగగా, సెప్టెంబర్‌లో 9 శాతానికి, ఒక్కసారిగా అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకీ ఏకంగా 50.5 శాతానికి చేరింది. ఇదే సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరిగింది. సెప్టెంబర్‌లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 1456 మెగావాట్లకు చేరింది. అక్టోబర్‌లో రోజువారీ విద్యుత్ వినియోగం 2025 లో 93.96 మిలియన్ యూనిట్లు ఉండగా, 2026 లో 141.5 మిలియన్ యూనిట్లకు పెరిగింది.
అధిక ఉష్ణోగ్రతలు వేడి తీవ్రత పెరగడంతో గృహాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్ల వినియోగం అధికమైంది. ముఖ్యంగా అక్టోబర్ మొదటి 15 రోజుల్లో విద్యుత్ వినియోగం ఆకస్మికంగా పెరిగింది. వాతావరణ వేడి కారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఉష్ణోగ్రత పెరిగి, తగిన చల్లదనం జరగకపోవడం వల్ల థర్మల్ వైఫల్యాలు సంభవిస్తున్నాయి. వ్యవసాయ ఫీడర్లకు మూడు ఫేజ్‌ల సరఫరా అందించే సమయంలో కనెక్ట్ అయిన మోటార్లు ఒకేసారి ప్రారంభమవుతాయి. దీంతో ప్రారంభ కరెంట్ ఒక్కసారిగా పెరిగి ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ అప్రకటిత కోతలు అనివార్యమవుతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు వ్యవసాయ మోటార్ల వద్ద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.