ఇళ్లు కూల్చకుండా ఉండాలంటే డబ్బులివ్వాల్సిందేనా
కరీంనగర్ సిటీ నవంబర్ 04 (విజయక్రాంతి): నగరంలోని కిసాన్‌నగర్(Kisan Nagar)లో ఇళ్ల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుడు కొమ్ముల కుమార్ ఆరోపించారు. రోడ్డు నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చివేస్తామని భయపెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బోయినపల్లి స్వరూప, కొమురవ్వ వెల్లడించారు. బుధవారం నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా కొమ్ముల కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసే ముందు తమ వ్యవహారాలను పరిశీలించుకోవాలని సూచించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌పై విమర్శలు చేసే అర్హత స్థానిక బీజేపీ నాయకులకు లేదన్నారు.
కిసాన్‌నగర్‌లో గాంధీ చౌరస్తా నుంచి రైల్వే కట్ట వరకు ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని, 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు అనుమతుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారి నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాల నిర్వాహకులను సైతం నెలవారీ వసూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని కొమ్ముల కుమార్ సవాల్ విసిరారు. అవసరమైతే వినాయకుడి లేదా హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేసేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. బీజేపీ నాయకులు కూడా ప్రమాణానికి ముందుకు రావాలని సవాల్ చేశారు. ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.