కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..

06-11-2026 | 08:12pm

తాడ్వాయి, నవంబర్ 06 (విజయక్రాంతి): తరచూ భార్యాభర్తల మధ్య గొడవ, కుటుంబ కలహాలు ఈ గొడవలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన కొత్త లావణ్య(42) అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తాడువాయి ఎస్సై నరేష్ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొత్త లచ్చవ్వ రాజ మల్లయ్య దంపతులకు సంతానం లేదు.సంతానం లేకపోవడంతో 12 సంవత్సరాల క్రితం తమ సోదరి కుమార్తె  కుమారుడైన తిమ్మాజివాడి గ్రామానికి చెందిన రాజును దత్తత తీసుకున్నారు.అతనికి లావణ్యతో వివాహం జరిపించారు.వీరిని దంపతులు తమ వద్దే ఉంచుకున్నారు.గత రెండు సంవత్సరాల క్రితం రాజు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలో రాజు ఆయన భార్య లావణ్య కుటుంబ విషయాలపై తరచూ భార్యాభర్తలు గొడవపడేవారు.

వీరిద్దరికీ లచ్చవ్వ చాలాసార్లు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది.కానీ వీరి మధ్య కలహాలు తొలగిపోలేదు. గురువారం రాత్రి సైతం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం లచ్చవ్వ తమ కులస్తులతో కలిసి రామారెడ్డికి బంధువుల నిశ్చితార్థ వేడుకలకు వెళ్ళింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో లావణ్య దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని దుబాయిలో ఉన్న రాజు సీసీ కెమెరాల ద్వారా గమనించి తన కూతురుకు సమాచారం అందించారు.ఆమె ఇరుగుపొరుగు వారిని పిలుచుకొని తాళం పగలగొట్టి లోపల పరిశీలించగా ఆమె ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు