ప్రధాన రోడ్డుపై గుంతలు...

04-11-2026 | 08:24pm

- పల్టీలు కొడుతున్న ప్రయాణికులు..

- పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, నవంబర్ 04 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రోడ్డుపై ప్రమాదకరమైన గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కామారెడ్డి పట్టణం నుంచి వయా కృష్ణాజివాడి, తాడువాయి మీదుగా వెళ్లే ఎల్లారెడ్డి రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు అదమరిసి వాహనాలు నడిపితే ప్రమాదానికి గురైనట్లేనని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రతిరోజు వందలాది మంది తిరిగే ఈ రోడ్డుపై చాలాచోట్ల అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో ఈ గుంతలను తప్పించబోయిన ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిగ్గా ఏండ్రి యాల స్టేజి వద్ద రోడ్డుపై రెండు గుంతలు లోతుగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ఏడాది క్రితం ఇదే గుంతను తప్పించబోయిన ఓ ప్రయాణికుడు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చాలామంది ప్రయాణికులు ఈ గుంతల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రమాదకరమైన గుంతలను పూడ్చిరోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

నాలుగు లైన్ల రోడ్డుకు మోక్షం ఎప్పుడో...

కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నాలుగు లైన్ల రోడ్డు కు మోక్షం ఎప్పుడో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే కేకేవై రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పిన ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. కరీంనగర్ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం పరిసర ప్రాంతాల్లో ఉన్న హైవే రోడ్డుకు ఈ రోడ్డును కలపడానికి ప్రతిపాదనలు రూపొందించారు.

ఈ రోడ్డుపై ప్రతిరోజు రద్దీ ఎక్కువగా ఉండటంతో నాలుగు లైన్ల రోడ్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపించి నిధులు సైతం మంజూరు చేయించినట్లు గతంలోనే తెలిపారు.కానీ ఇప్పటికీ ఈ రోడ్డుకు మోక్షం లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కామారెడ్డి,ఎల్లారెడ్డి రోడ్డు ను నాలుగు లైన్ల రోడ్డుగా మార్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఐదు సంవత్సరాల క్రితమే ఇండ్లకు మార్కులు...

ఈ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు గా మారుతుందని నిధులు మంజూరయ్యాయని గత ఐదు సంవత్సరాల క్రితమే అధికారులు హడావిడి చేశారు.గ్రామాలలో రోడ్డు నుంచి సరిగ్గా 55 ఫీట్లు కొలుచుకొని 55 ఫీట్ల లోపల ఉన్న ఇండ్లకు అధికారులు మార్క్ వేశారు. మీ ఇంటిని ఇంటి స్థలాన్ని వెనక్కి జరుపుకొని నిర్మించుకోవాలని యజమానులకు సూచించారు.కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు మంజూరు చేయించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

జిల్లాకే ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు ప్రధాన రోడ్డుగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రం కావడంతో నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మదునూర్, పెద్ద కొడుప్ గల్ మండలాల ప్రజలు ప్రతిరోజు ఈ రోడ్డు నుంచే  జిల్లా కేంద్రానికి ప్రయాణం చేయవలసి వస్తుంది. అందుకోసం ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా వెళుతుంటాయి.దీంతో రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు