విద్యార్థుల భవిష్యత్తుకు పుస్తక పఠనమే పునాది
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి...
బాన్సువాడ, నవంబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాత బాన్సువాడ(ZPHS Old Banswada), జెడ్పీహెచ్ఎస్, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు(Government Agricultural Advisors), ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో పుస్తకాలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.
పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, విజ్ఞానం పెంపొందడమే కాకుండా ఆలోచనా శక్తి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు చదివే ప్రదేశం మాత్రమే కాదని, ప్రతి విద్యార్థి తన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే విజ్ఞాన కేంద్రం అని అభివర్ణించారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించడంతో పాటు వారి విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులందరూ ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ కాసుల విజయతో పాటు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.