ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది..
విద్యార్థులకు ఓటరు ప్రత్యేక సవరణపై అవగాహన
బిజెపి పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి..
బాన్సువాడ, నవంబర్ 6 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) కార్యక్రమంపై కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రేణుక ఒకేషనల్ కళాశాలలో శుక్రవారం బీజేవైఎం(BJYM) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రాధాన్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల బొగుడ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు చోరీ పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం ఓటరు జాబితాలోని తప్పులను సరిచేయడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించడం మాత్రమేనని వివరించారు. దీనివల్ల ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, కచ్చితత్వంతో రూపొందుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత చైతన్యవంతమైన పాత్ర పోషించాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు యువ మోర్చా ఐటీ సెల్ కో కన్వీనర్ సచిన్ బిజెపి నాయకులు లక్ష్మీ నారాయణ పురుషోత్తం ప్రదీప్ నాగరాజు తదితరు పాల్గొన్నారు.