రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన..

06-11-2026 | 07:47pm

రైతు పొలాల్లో ఆవిష్కరణలు, కార్యక్రమంలో పెసర, మినుము విత్తన కిట్ల పంపిణీ

గరిడేపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక దిగుబడులు, లాభాలు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana State Agricultural University) ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ వ్యవసాయ కళాశాల, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శుక్రవారం గరిడేపల్లి గ్రామంలో ‘రైతు పొలాల్లో ఆవిష్కరణలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు పెసర, మినుము విత్తన కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావిత వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకునే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ నీటి వనరులతో సాగు చేయగల పెసర, మినుము పంటలతో మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. విత్తనాలతో పాటు నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కూడా రైతులకు అందజేశారు.

ఈ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వినియోగించడం వల్ల యూరియా వంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేల సారవంతం, ఆరోగ్యం మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం వల్ల తదుపరి పంటలో కలుపు మొక్కల ఉధృతి తగ్గడంతో పాటు చీడపీడల ప్రభావాన్ని కూడా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, శివప్రసాద్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి.ప్రియతమ్ కుమార్, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులు శిరీష, సంధ్య, రైతులు నలబోలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు