బాణసంచా విక్రయాల అక్రమాలపై విచారణకు డిమాండ్

06-11-2026 | 07:39pm
  1. ఏజెన్సీలో భద్రతా ప్రమాణాలు పాటించాలి 
  2. లంబాడా జేఏసీ నాయకుల డిమాండ్

కొత్తగూడెం నవంబర్ 6 విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కొత్తగూడెం పట్టణంతో పాటు , ఏజెన్సీ ప్రాంతమైన(Agency area) రామవరం పరిసరాల్లో దీపావళి బాణసంచా విక్రయాల(Diwali firecracker sales) పేరుతో జరుగుతున్న అక్రమాలు, అధిక ధరల వసూళ్లు(Irregularities and charging of excessive prices), లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనలు , భద్రతా లోపాలపై సంబంధిత అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, గిరిజన లంబాడీ సంఘాల (జి ఎల్ సి) జేఏసీ జిల్లా జాయింట్ సెక్రెటరీ బానోత్ శ్రీనివాస్ నాయక్,  జిల్లా ప్రచార కార్యదర్శి బానోత్ రాజ్ కుమార్ నాయక్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్  కి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొంతమంది వ్యాపారులు మారుపేరుతో లైసెన్స్ పొందుతూ, అదే లైసెన్స్ ఆధారంగా రెండు నుంచి నాలుగు వేర్వేరు బాణసంచా విక్రయ షాప్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సంబంధిత లైసెన్స్ ఒకే  షాప్ కు మాత్రమే వర్తిస్తుందా లేదా ఇతర షాప్ కూడా అనుమతి ఉందా అనే అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.

అలాగే దీపావళి పండుగను ఆసరాగా చేసుకొని బాణసంచాను అధిక ధరలకు విక్రయిస్తూ, నిర్ణీత ధరల పట్టికలను ప్రదర్శించకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాణసంచా స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిమితులు మరియు ఇతర ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతానికి వర్తించే ప్రత్యేక చట్టాలు, నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత రసాయన పదార్థాలతో తయారైన బాణసంచా విక్రయాలను అరికట్టాలని, అనుమతించబడిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించేలా పర్యవేక్షించాలని కోరారు. ప్రతి బాణసంచా ఉత్పత్తిపై సంబంధిత ధృవీకరణ, క్యూఆర్ కోడ్ తదితర వివరాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బాణాసంచా నివాస ప్రాంతాలకు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన  స్టాళ్లను గుర్తించి తొలగించాలనీ, ఏజెన్సీ ప్రాంతానికి వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం విక్రయ అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలని, స్టాల్ వద్ద నిర్ణీత ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. 

గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్, ధృవీకరణ వివరాలు మరియు ఉత్పత్తుల చట్టబద్ధతను తనిఖీ చేపట్టాలని ప్రతి స్టాల్ వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు మరియు ఇతర అవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలనీ, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన పాత బాణసంచా (పాత స్టాక్) విక్రయాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్, అగ్నిమాపక మరియు సంబంధిత శాఖల అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించాలి.

ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా ఉన్న స్టాళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రాణాల కంటే వ్యాపార లాభాలు ముఖ్యం కాదు అని జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన రామవరం పరిసరాల్లో ప్రత్యేక విచారణ చేపట్టి, అక్రమాలకు తావులేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు