సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం
సూర్యాపేట జిల్లా మార్కెటింగ్ అధికారి పి. దామోదర్
నేరేడుచర్ల, నవంబర్ 06(విజయక్రాంతి): జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను(Cotton purchasing centers) ఏర్పాటు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి పి. దామోదర్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్(Nereducherla Agricultural Market) కార్యాలయాన్ని సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. చింతలపాలెంలో రెండు, సూర్యాపేటలో ఒకటి, తిరుమలగిరిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం క్వింటాల్ పత్తికి రూ.8,667/- మద్దతు ధర అందిస్తున్నట్లు చెప్పారు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. రైతులందరూ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తి అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. దళారులను నమ్మకుండా నేరుగా కేంద్రాలకే పత్తి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం వరికి కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉందన్నారు. జై శ్రీరామ్, చింట్లు వంటి సన్న రకాలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారని, వాటికి మంచి రేటు లభిస్తుందని తెలిపారు.
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.43.5 లక్షలు, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.4 కోట్లు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.3.75 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నిధులతో మార్కెట్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి టి. సన్నీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.