ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి

13-10-2026 | 04:38pm
  1. మాజీ ఎమ్మెల్యే గండ్ర 
  2. మెరుగైన వైద్య సేవలు అందించడంలో వారి పాత్ర కీలకమని వెల్లడి
  3. ఉద్యోగుల నిరవధిక సమ్మెకు గండ్ర సంఘీభావం

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ) : మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పాత్ర కీలకం అని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు గండ్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ  ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన వారి సేవలను ప్రభుత్వం గుర్తించి, తగిన గౌరవం కల్పించాలని కోరారు.

ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికి న్యాయం జరగాలని, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చి ఉద్యోగులకు న్యాయం చేయాలని గండ్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు