మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్
మల్లాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) (జెడ్పీహెచ్ఎస్), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లను గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య బుధవారం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారీని స్వయంగా పరిశీలించి అన్నం, కూరల నాణ్యతను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. పాఠశాలలో భోజనానికి సంబంధించి లేదా ఇతర సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వంట సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేలా ఉపాధ్యాయులు, వంట సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీపీఎస్ విద్యార్థులతో కలిసి సర్పంచ్ మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే రెండు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్ పిట్స్కు ముగ్గు పోశారు.
పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీటి నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదలకు సోక్ పిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, కార్యదర్శి కవిత, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం చంద్రప్రకాష్, ఎంపీపీఎస్ హెచ్ఎం లక్కిడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, రాజేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.