అప్రమత్తతతో పనిచేయాలి

08-10-2026 | 10:40pm

వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి అప్రమత్తతతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ 

ఓపీ సమయాలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలి

 పారిశుద్ధ్యం, వైద్యo పై నిరంతర పర్యవేక్షణ

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) ఆదేశించారు. గురువారం వైద్యఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రుల్లో ఓపీ సమయాలను,వైద్యులు సమయపాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాత్రి సమయాల్లో అత్యవసర వైద్య సేవల(Quality Medical Services)పై దృష్టి సారించాలని,వైద్యుల విధులను పర్యవేక్షించాలని తెలిపారు. విధి నిర్వహణలో అంతరాయం కలగకుండా,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

పాల్వంచ, రామవరం, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపహాడ్ తదితర ప్రాంతాల్లో వైద్య సేవల పరిస్థితిని సమీక్షిస్తూ గైనకాలజీ వైద్యుల అందుబాటు, ప్రసూతి సేవలు, కేసుల భారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని బలోపేతం చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ తదితర అందుబాటులో ఉన్న నిధులతో అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల పనులు, అదనపు పడకల సామర్థ్యం, అవసరమైన వైద్య పరికరాలపై కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఆసుపత్రిలో వైద్య సేవలను అధికారులు, ఎప్పటికప్పుడు  క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సూపర్‌వైజర్లు తదితర సిబ్బందితో, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి విధి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణపై సమీక్షించాలని కలెక్టర్ సూచించారు.

డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పరీక్షలు, మందులు, వైద్య సిబ్బంది అందుబాటును ముందుగానే నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సందర్భాల్లో మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు రిఫర్ చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. 

ప్రజలకు అందించే ప్రతి వైద్య సేవలో నాణ్యత, సమయపాలన, బాధ్యతతో కూడిన సేవలు ఉండాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్లు తమ పరిధిలోని ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ రవిబాబు, జిల్లా ఏరియా ఆసుపత్రిల సూపర్డెంట్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు