గుడుంబా స్థావరాలపై ఆబ్కారీ కొరడా
- మంథనిలో ముకుమ్మడి మెరుపు దాడులు
- 1,200 లీటర్ల పులిసిన బెల్లం పానకం, 20 లీటర్ల సారా ధ్వంసం
మంథని, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని గుడుంబా తయారీ స్థావరాలపై గురువారం ఉదయం ఆబ్కారీ శాఖ అధికారులు(Excise Department officials) మెరుపు దాడులు నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, పెద్దపల్లి డిపీఈఓ శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు అధికారులు ఈ దాడులు చేపట్టారు.
మంథని పట్టణంలోని బోయిన్ పేట నివాస గృహాలకు ఆనుకుని ఉన్న బొక్కల వాగు పరిసరాలతో పాటు అటవీ ప్రాంతాలలో ముకుమ్మడిగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన సుమారు 1,200 లీటర్ల పులిసిన బెల్లం పానకంతో పాటు 20 లీటర్ల నాటు సారాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకుని, అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి పాల్పడిన వ్యక్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తూ విచారణ జరుపుతున్నారు.
మంథని ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పెద్దపల్లి ఎక్సైజ్ సీఐ రజితారెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్వర్ వైద్య, మంథని ఎక్సైజ్ ఎస్ఐ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పట్టణ పరిసరాల్లో గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.