రోస్టర్ పాయింట్‌ను 10 లోపు తగ్గించాలి
- మాల జేఏసీ డిమాండ్
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): మాలలకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేసేందుకు రోస్టర్ పాయింట్‌ను 22 నుంచి 10 లోపు తగ్గించాలని మాల జేఏసీ(Mala JAC) సిద్దిపేట జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మాల జేఏసీ ఆవిర్భావ సదస్సు(Mala JAC Inaugural Conference)లో వారు మాట్లాడారు. ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల చిన్న సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు మాలలకు అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాలల జనాభా, రిజర్వేషన్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గ్యాదరి రామస్వామి, ఆశ లక్ష్మణ్, గ్యాదరి పరమేష్, పి.శంకర్, మెరుగు మహేష్ పాల్గొన్నారు.