దేవాదాయ భూములకు ‘శఠగోపం’

09-10-2026 | 05:05am
  1. చేవెళ్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాల్లో కోట్ల అక్రమాలు!
  2. హైవే పక్కన దేవుడి ఆస్తులు లీజుదారుల పరంపర.. 
  3. వందల అద్దెలతో ఆలయ ఆదాయానికి భారీ గండి
  4. అధికారుల ఉదాసీనతపై మండిపడుతున్న భక్తులు

చేవెళ్ల, అక్టోబర్ 8 (విజయక్రాంతి): భక్తులు నమ్మకంతో దేవుడి పేరిట సమర్పిం చిన భూములు, ఆస్తులు ఆలయాల అభివృద్ధికే కాకుండా దేవాదాయ శాఖ(Endowments Department)కు ప్రధాన ఆదాయ వనరుగా నిలవాలి. కానీ, చేవెళ్లలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న లీజు వ్యవహారాలు చూస్తుంటే దేవుడి సొమ్ము దారి మళ్లుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన కమర్షియల్ స్థలాలను అత్యల్ప ధరకు లీజుకు ఇస్తూ, నిబంధనలను నీరుగారుస్తూ దేవాదాయ శాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

వందల లీజులు.. కోట్ల వ్యాపారాలు!

హైదరాబాద్‌ బీజాపూర్ జాతీయ రహదారి, ముంబై బెంగళూరు బైపాస్ మార్గానికి ఆనుకుని ఉండటంతో చేవెళ్ల ప్రాంతంలో కమర్షియల్ భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చేవెళ్ల మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ కోట్లకు చేరింది. గతంలో ఆలయ నిర్వహణ వ్యయం కోసం కేటాయించిన భూములు నేడు వ్యాపారవేత్తలకు కామధేనువులా మారాయి.

ప్రస్తుతం ఈ స్థలాల్లో మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్, హోటళ్ళు, ఫర్టిలైజర్ దుకాణాలు, మెడికల్ కాంప్లెక్స్లు, స్వీట్ షాపులు, టిఫిన్ సెంటర్లు వంటి పదుల సంఖ్యలో వాణిజ్య సముదాయాలు వెలిశాయి. వ్యాపారులు రోజుకు లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తుంటే, దేవాదాయ శాఖకు మాత్రం పాత కాలం నాటి ‘వందల రూపాయల‘ లీజు చార్జీలే దక్కుతుండటం గమనార్హం.

టెండర్ల పేరిట ప్రహసనం.. 

పాతవారికే కట్టబెట్టడం వెనుక మతలబు?....వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఈ లీజు వ్యవహారంలో అధికారులు ప్రతి ఏడాది బహిరంగ టెండర్లు నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ, తిరిగి పాత లీజుదారులకే ఆస్తులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. కొత్త వ్యాపారులు పోటీకి రాకుండా అంతర్గత ఒప్పందాలతో టెండర్ ప్రక్రియను మమ అనిపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.అనుమతికి మించి అక్రమ నిర్మాణాలు: ఒప్పందంలో ఉన్న విస్తీర్ణానికి మించి హైవే బఫర్ జోన్లను కూడా ఆక్రమించి బహుళ అంతస్తుల కాంప్లెక్స్లను నిర్మించారు.

మార్కెట్ విలువతో సంబంధం లేని లీజులు....

ప్రభుత్వం ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆస్తి పన్నులు పెంచుతున్నా, దేవాదాయ భూముల లీజు రుసుములను సవరించకపోవడం వెనుక భారీ అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి వందల్లో చెల్లిస్తూ, మూడో వ్యక్తికి వేలల్లో, లక్షల్లో అద్దెలకు ఇస్తూ లీజుదారులు దేవుడి ఆస్తులపై సొమ్ము చేసుకుంటున్నారు.

నిద్రమత్తులో యంత్రాంగం....

చేవెళ్ల పట్టణంలో సాధారణ ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపల్ పన్నులు, అనుమతుల పేరిట కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు, దేవుడి భూముల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ఏ ఒక్క అధికారి రాకపోవడం వెనుక పరోక్ష సహకారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈవో బహిరంగ ప్రకటన చేయాలి....

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు ఆలయ ఈవో తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని భక్తులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఆలయ కమర్షియల్ స్థలాల్లో ప్రస్తుతం ఉన్న ఆక్రమణలు, అనుమతికి మించి చేసిన నిర్మాణాలను క్షేత్రస్థాయి సర్వే ద్వారా గుర్తించాలి.పారదర్శక ఈ-టెండర్లు: బహిరంగంగా ఈ-టెండర్లు నిర్వహించి ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా లీజు రుసుములను పునఃసమీక్షించాలి.

చట్టపరమైన చర్యలు.... 

నిబంధనలు ఉల్లంఘించిన లీజుదారుల ఒప్పందాలను తక్షణమే రద్దు చేసి, నోటీసులు జారీ చేయాలి.దేవుడి భూములను రక్షించాల్సిన బాధ్యతను విస్మరిస్తే ప్రజా పోరాటాలు తప్పవని, ఉన్నతాధికారులు స్పందించి చేవెళ్ల వెంకన్న ఆస్తులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు