ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: జడ్జి స్వరూప కాటం
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఖైదీలు గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో మళ్లీ తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం(Judge Swaroopa Katam) సూచించారు. మంగళవారం సాయంత్రం ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలును సందర్శించిన ఆమె ఖైదీలతో మాట్లాడారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల జీవితాలతో పాటు వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
అనంతరం జైలు రికార్డులు, వంటశాల, ములాఖత్ గదులు, పరిసరాలను పరిశీలించి ఖైదీలకు అందించే భోజన మెనూను తనిఖీ చేశారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయ సేవల ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రతినిధి కీర్తి కార్తిక్, సబ్‌జైలు చీఫ్ బి.ఉదయ్ కుమార్, హెడ్ వార్డెన్ భుజరంగరాజు, సిబ్బంది సాంబ, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.