సహకార సంఘంలో అక్రమాలపై డైరెక్టర్ల ఆగ్రహం
బోథ్ సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి) బోథ్ మండల సహకార సంఘం మహాజన సభ (Cooperative Society General Body Meeting)శుక్రవారం అధ్యక్షులు కదం ప్రశాంత్ (Kadam Prashanth)ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో ఉపాధ్యక్షులు కోల రాజేశ్వర్ సీఈవో భారె నాగభూషణ్ తోపాటు డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఏడాది వ్రాయవిక్రయాలు కొనుగోళ్లపై నివేదికను సీఈవో చదివి వినిపించారు. అయితే సోయాబీన్ కొనుగోళ్లలో నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కొంతమంది రైతులు మట్టిని నింపి విక్రయించారని సీఈవో తెలిపారు. బోత్ ,సోనాల దన్నూర్ గ్రామాలలో కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేశామన్నారు. దాదాపు 4 లక్షల నుండి ఎన్ని లక్షల వరకు నష్టం సంభవించిందని వివరించారు. సభలో పాల్గొన్న సహకార సంఘం డైరెక్టర్ ధ్యాగల నారాయణ, లోపు పోశెట్టిలు జరిగిన నష్టం వివరాలను వివరంగా తెలుపాలని డిమాండ్ చేశారు. నష్టం ఎక్కువ జరిగిందని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. బస్తాలలో నుండి కింద పడిపోయిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇతరుల పేరు మీద విక్రయించారని ఆరోపించారు.
ఆ సమయంలో తాను లేనని పూర్తి సమాచారం అప్పటి సీఈవో గోలి స్వామి ద్వారా తీసుకొని సభకు వివరిస్తామన్నారు. అనంతరం సమావేశంలో నూతనంగా డీసీఎంఎస్ సెంటర్ ఏర్పాటు కోసం ఒకరు దరఖాస్తు చేసుకున్నారని సభ ఆమోదిస్తే అనుమతిస్తామని సీఈవో తెలిపారు. కొంతమంది డైరెక్టర్లు మరో సెంటర్ ఏర్పాటు చేస్తే సంఘానికి నష్టం వాటిల్లుతుందని మండల కేంద్రంలో కాకుండా వేరే చోట ఇవ్వాలని సి ఓ కు సూచించారు. అయితే ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు వివరించిన తర్వాత సెంటర్ మంజూరిపై తగు నిర్ణయం తీసుకుంటామని సీఈఓ తెలిపారు.
కాగా గతంలో పంట విక్రయాల సందర్భంగా రైతులు గన్ని బ్యాగులను కొనుగోలు చేసి పంట విక్రయించారని వారి కి సంబంధించిన డబ్బులు త్వరలో వారి వారి అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా కొనుగోలు జరపాలని సభ్యులు సూచించారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ సహకార సంఘం డైరెక్టర్ జి రాజు యాదవ్. ఇదాపు మనోహర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.