దేవస్థానం కొండపైన 30 కోట్లతో నూతన కళ్యాణ మండపం

30-10-2026 | 08:16pm

రాయగిరి వద్ద 3.5 కోట్లతో ఆర్చ్ నిర్మాణం పనులకు భూమి పూజ

పాలకమండలి ఏర్పడిన నాలుగు నెలలలోనే ఎన్నో పనులకు శ్రీకాకుళం

యాదగిరిగుట్ట పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): తెలంగాణలోనే ఆధ్యాత్మిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple) కొండపైన  30 కోట్లతో నూతన కళ్యాణమంటపం కు భూమి పూజ, 3.5 కోట్లతో రాయగిరి వద్ద ఆర్చి నిర్మాణానికి పాలకమండలి చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలకమండలి సభ్యులు  భూమి పూజ చేశారు. శుక్రవారం దేవస్థానం కొండపైన నూతన కళ్యాణమండపం భూమి పూజ శాస్త్రృక్తంగా  పండితులు నిర్వహించారు.

రాయగిరి వద్ద ఆర్చ్ గేటు నిర్మాణ పనులకు భూమి పూజ అనంతరం దేవస్థానం పాలకమండలి చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం కు పాలకమండలి  ఏర్పాటు చేసినప్పటి నుండి వారి దశా దిశలోనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పాలకమండలి ఏర్పడి   నాలుగు నెలల వ్యవధిలోనే రెండుసార్లు సమావేశమై ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని మొదటగా మెట్ల దారి షెడ్ నిర్మాణము, కొండపైన శంకు,చక్ర, నామాల ఏర్పాటు నిర్ణయం, భక్తుల పాదరక్షల రుసుమును తొలగించడం భక్తులకు త్వరగా దర్శనాలు అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కొండపైన ఒకేరోజు 1500 నుండి 2000 మంది కళ్యాణోత్సవము జరిపించుకునేందుకు వీలుగా మూడు ఫ్లోర్లతో అత్యాధునిక హంగులతో నిత్య కళ్యాణం మంటపమును నిర్మించడం కోసం 30 కోట్ల తన సొంత ఖర్చులతో నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రాయగిరి వద్ద 3.5 కోట్లతో ఆర్చి నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి దాదాపు 90 సంవత్సరాలు కఠిన శ్రమ ద్వారా ఈరోజు దేశ విదేశీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆరాధ్య కేంద్రంగా మారిందని అదే విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు దేశ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొంత సమయం పడుతుందని,  ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, భక్తులు సూచనలు సలహాల మేరకు కొన్ని నిర్ణయాలను త్వరితగతిన తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దేవుడు మాకు ఇంకా శక్తిని ఇస్తే రెట్టింపు ఉత్సాహంతో అంతకంటే ఎక్కువ పనులు చేయగలుగుతామని అన్నారు.

ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య మాట్లాడుతూ  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నియమించిన పాలకమండలి చైర్మన్, సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారని ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుంటూ అందరి సలహాలు సూచనలు తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని ఇది అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ఆధ్వర్యంలో పాలకమండ దేవస్థానం పాలకమండలి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే గడ్డం వినోద్, టి. విజేందర్ గౌడ్,  లక్ష్మీనారాయణ , శ్రీమతి ఈశ్వరమ్మ , గుండు మల్లయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి  జె. భవానీ శంకర్, గుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు