ఉపాధి హామీ లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం సహించేది లేదు
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 30 ( విజయ క్రాంతి ): గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను(Employment guarantee works) వేగవంతం చేయడంతో పాటు జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ నిరంతరం ఉపాధి కల్పించాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) సంబంధిత గ్రామ, మండల స్థాయి అధికారులతో పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 2027 జూన్, జూలై నెలల వరకు ఉపాధి హామీ పనుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు అదనపు పనులను గుర్తించి తగినన్ని అంచనాలు రూపొందించి ముందస్తుగా అనుమతులు, మంజూరులు పొందాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద సోక్ పిట్స్, ఫామ్ పాండ్స్, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం తదితర పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో జాబ్ కార్డుదారుల సంఖ్య, కూలీల అవసరాలు, అందుబాటులో ఉన్న పనులను గుర్తించి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీలు, మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని, కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన గ్రామాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పనుల పురోగతిని మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను పెంపొందించేందుకు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే మార్చి నెల నాటికి నూటికి నూరు శాతం పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
కొన్ని మండలాల్లో పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతి గ్రామపంచాయతీ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పన్నుల వసూళ్ల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆన్లైన్లో నమోదైన రికార్డులనే ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉపాధి హామీ పనుల పురోగతి, గ్రామాల్లో ఆస్తుల సృష్టి, పన్నుల వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డీఆర్డీఓ రఘువరన్, ఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.