డంపింగ్ యార్డ్ వద్దని తహసీల్దార్‌కు వినతి
కొత్తపల్లి,(విజయక్రాంతి): పౌరహక్కుల దినోత్సవాన్ని(Civil Rights Day) పురస్కరించుకుని కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో బయోమైనింగ్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన నిర్వహించారు.గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ కొత్తపల్లి మండల తహసీల్దార్ గారికి గ్రామ సర్పంచ్ నూనుగొండ మానస-ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం(Telangana Ambedkar Youth Association) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ కమాన్‌పూర్ గ్రామ ప్రజల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా గ్రామ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో అనేక పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో దళితుల శ్మశానవాటిక, యాదవుల వ్యవసాయ భూములు, వైకుంఠధామం ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలను, స్థానిక అవసరాలను విస్మరించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి హాని జరగకుండా శాస్త్రీయ పద్ధతిలో చెత్త నిర్వహణ చేపట్టేందుకు బయోమైనింగ్ విధానాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరె నరేష్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, జిపిఓ రోహిణి, వార్డ్ సభ్యులు, నాయకులు ఆరిగాల మల్లేష్, రుద్ర రాజు, తోడేటి మధు, గికూరు చందు, బోనాల సంపత్, ఏనుమట్ల బాబు, క్యాదాసి పర్శరాం, కుంట ఆదిరెడ్డి, బొబ్బటి శ్రీకాంత్, వేముల అనిల్, బోండ్ల శ్యాం, బుస సంతోష్ తదితరులు పాల్గొన్నారు.