వికలాంగులను బైండోవర్ చేయించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది?
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం: ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
ఆలేరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (National Platform for Rights of Disabled) నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేయించడంపై ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులను బైండోవర్ చేయించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
సోమవారం భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కొడంగల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్పీఆర్డీ నాయకులు, కార్యకర్తలను ఉదయం నుంచే బైండోవర్ చేయడాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వికలాంగులను బైండోవర్ చేయించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. వికలాంగుల హక్కుల(Rights of persons) కోసం ప్రశ్నించే వారిని అణచివేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు.
పోరాట ఫలితంగానే కొత్త పెన్షన్లు మంజూరు:
గత మూడేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితంగానే నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఉపేందర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా ఉపాధ్యక్షుడు చిత్తలూరి శ్రీహరి పాల్గొన్నారు.