జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు అండగా ఉండాలి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bavesh Mishra) సూచించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మెగా రైతు మేళా(Mega Rythu Mela) కార్యక్రమాన్ని సోన్ రైతు వేదిక నుంచి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించారు.
జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పొందాలని తెలిపారు. రైతులకు అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి రమణ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు అనిల్, సందీప్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీపీఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.